అత్యుత్తమ పని తీరు కనబరిచిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో టాటా మ్యూచువల్ ఫండ్ అందిస్తున్న స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ఒకేసారి చేతికి రూ.28 లక్షలు అందించింది. మరి అందుకు ఎంత పెట్టుబడి, ఎన్నేళ్లు పట్టిందో తెలుసుకుందాం?
మిడ్ క్యాప్ ఫండ్లు మధ్యస్థ స్థాయి ఈక్విటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. 101 నుంచి 250 మధ్య ర్యాంక్ ఉన్న కంపెనీలు ఇందులో ఉంటాయి. ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్న మిడ్ క్యాప్ ఫండ్లలో టాటా మ్యూచువల్ ఫండ్ (Tata Mutual Fund) అందిస్తోన్న టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్ (Tata Mid Cap Growth Fund Regular) అదరగొట్టింది. గత 10 ఏళ్లలో హైరిటర్న్స్ అందించింది.
టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్ సైజ్ రూ.4333 కోట్లుగా ఉంది. ఈ ఫండ్ 92.66 శాతం పెట్టుబడులను దేశీయ ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అందులో 14.16 శాతం లార్జ్ క్యాప్ స్టాక్స్, 47.01 శాతం మిడ్ క్యాప్ స్టాక్స్, 15.1 శాతం మేర స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. కనీసం 3-4 సంవత్సరాల తర్వాత డబ్బులు అవసరమయ్యే ఇన్వెస్టర్లకు టాటా మిడ్ క్యాప్ ఫండ్ సరైన ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధం ఉన్నవారు మాత్రమే వీటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునే ఇన్వెస్టర్లు కనీసం నెలకు రూ.500 నుంచి సైతం ఇన్వెస్ట్ చేయవచ్చు. టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్ సిప్ రిటర్న్స్ గత ఏడాది కాలంలో చూస్తే 15.39 శాతం మేర నష్టాలు మిగిల్చాయి. అయితే గత 2 సంవత్సరాల రికార్డ్స్ చూసుకుంటే 7.45 శాతం లాభాలు అందించింది. గత 3 సంవత్సరాల్లో 14.76 శాతం లాభాలు ఇచ్చింది. గత 5 సంవత్సరాలు అయితే 18.67 శాతం, గత 10 సంవత్సరాలు అయితే 16.52 శాతం లాభాలు అందించింది.
ఒకేసారి చేతికి రూ.28 లక్షలు..
టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌లో సరిగ్గా 10 సంవత్సరాల క్రితం సిప్ ద్వారా నెలకు రూ.10 వేల చొప్పున ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే ఇప్పుడు హైరిటర్న్స్ వచ్చుంటాయి. ఈ స్కీమ్ ఎక్స్ఐఆర్‌ఆర్ 10 సంవత్సరాల్లో 16.52 శాతంగా ఉంది. అంటే దీని ప్రకారం చూసుకుంటే మొత్తం 10 ఏళ్లలో పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. దానిపై రూ.16.50 లక్షలకుపైగా వడ్డీ వస్తుంది. మొత్తంగా చేతికి రూ.28.50 లక్షలకుపైగా అందుతాయి.
అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఎక్కువ ఉంటుంది. గతంలో వచ్చిన ఫలితాలు భవిష్యత్తులోనూ వస్తాయన్న గ్యారెంటీ ఉండదు. అందుకే పూర్తి వివరాలు తెలుసుకుని, నిపుణుల సూచనలతో ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.