ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాణిజ్య మార్పులు భారత మార్కెట్‌పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,650 పెరిగి 10 గ్రాములకు రూ.98,100కు చేరాయి. రోజు రోజుకు పసిడి ధర సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నది. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరి.. తులానికి రూ.లక్షకు చేరువైంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతున్నది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9 ప్యూరిటీ బంగారం ధర ఒకే రూ.1,650 పెరిగి తులానికి రూ.98,100 చేరింది. పుత్తడి ధర రూ.96,450 వద్ద ఉండేదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. మరో వైపు 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర సైతం రూ.1,650 పెరిగి తులానికి రూ.97,650కి పెరిగి గరిష్ఠానికి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర సైతం రూ.1,900 పెరగడంతో కిలో రూ.99,400కి పెరిగింది. ప్రపంచ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు రికార్డు స్థాయిలో 3,318 డాలర్లు చేరింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గి 3,299.99 డాలర్లకు పతనమైంది.
అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం నడుస్తున్నది. ఈ క్రమంలో బంగారం ధర పెరుగుతోందని కొటక్ సెక్యూరిటీస్లోని ఏవీపీ కమోడిటీ రీసెర్చ్ కైనత్ చైన్వాలా తెలిపాడు. బుధవారం అమెరికా చైనా నుంచి దిగుముతి చేసుకునే వస్తువులపై సుంకాలను 254 శాతానికి పెంచింది. ఈ క్రమంలో మార్కెట్‌పై మరింత ఒత్తిడి పడింది. అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా మాట్లాడుతూ.. అమెరికా డాలర్ ఇండెక్స్ 100 మార్కు కంటే దిగువకు పడిపోవడంతో, మూడేళ్ల కనిష్ఠానికి చేరుకోవడంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో గరిష్ఠాలను తాకుతున్నాయన్నారు. వడ్డీ రేట్లు తగ్గింపు అంచనాలు పెరగడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగాన్ని పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారని.. ఈ క్రమంలో బంగారం ధర పెరుగుతోందని పేర్కొన్నారు. మరో వైపు ఆసియా మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ దాదాపు 2శాతం పెరిగి 32.86 డాలర్లకు చేరుకుంది.