బంగారం ధరలు.. ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరికీ అంతుచిక్కడంలేదు. పదిరోజుల క్రితం వరకు గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. దీంతో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.లక్ష దాటింది. కానీ, కొద్దిరోజులుగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.93వేలకు దిగొచ్చింది. అంతర్జాతీయంగా స్పాట్ బంగారం 1.8శాతం తగ్గి ఔన్సుకు 3,255.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, వచ్చే మూడు నెలల్లో గోల్డ్ రేటు రూ.88వేల మార్క్ కు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బంగారం మాయలో పడొద్దని మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు . బంగారంపై పెట్టుబడులు ఎల్లప్పుడూ అద్భుతమైన రాబడిని ఇస్తాయనుకోవద్దని చెబుతున్నారు.
స్వల్పకాలిక ధోరణుల ఆధారంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. కొన్నేళ్లుగా బంగారం బలమైన రాబడులను అందించినప్పటికీ, ఎల్లప్పుడూ అలా ఉండదని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి, బంగారం దాదాపు సున్నా రాబడిని అందించిన సుదీర్ఘ కాలం కూడా ఉంది. చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు ఈ వాస్తవాన్ని విస్మరిస్తున్నారని చెబుతున్నారు.
2012 నుంచి 2019 వరకు బంగారంపై రాబడులు ఏ మాత్రం ఉన్నాయనే దానికి సంబంధించిన చారిత్రక లెక్కలను ముందుపెడుతున్నారు నిపుణులు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బంగారం ధరలు పెద్దగా పెరిగిందేమీ లేదు. 2012లో 10 గ్రాముల బంగారం ధర రూ.31,050 ఉండగా… 2019 నాటికి అది స్వల్పంగా పెరిగి రూ.35,220కి చేరింది. అంటే 8 సంవత్సరాలలో పెరిగింది కేవలం రూ .4,170. శాతంలో చెప్పాలంటే మొత్తం 13% రాబడి.
సగటున చూసినప్పుడు, కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు సంవత్సరానికి 1.5% కంటే తక్కువగానే ఉంది. ఇక 1992 నుంచి 2002 మధ్య కాలంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.4,334 నుంచి కేవలం రూ.4,990కి పెరిగిందని, 1.5 శాతం కంటే తక్కువ వార్షిక రాబడులు వచ్చాయని వారు పేర్కొంటున్నారు.
2020 తర్వాత బంగారం ధరలు అకస్మాత్తుగా పెరగడం యాదృచ్ఛికం కాదని నిపుణులు వివరిస్తున్నారు. 2019 కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనలు, కేంద్ర బ్యాంకులు దూకుడుగా బంగారం కొనుగోలు చేయడం ఇవన్నీ బంగారం నాటకీయ పెరుగుదలకు దోహదం చేశాయని చెబుతున్నారు.
బంగారం ఇప్పటికీ మంచి పెట్టుబడేనా అంటే .. పెట్టుబడి పోర్ట్ఫోలియోలో బంగారానికి ఎప్పటికీ విలువ ఉంటుంది. కానీ ఇది డైవర్సిఫికేషన్, హెడ్జింగ్ సాధనంగా మాత్రమే ఉంటుంది. ఈక్విటీల మాదిరిగా స్థిరమైన రాబడిని అందించదు. కాబట్టి మొత్తం పోర్ట్ఫోలియోలో బంగారానికి కేవలం 5% నుంచి 12% కేటాయించాలని మార్కెట్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.








