‘టాటా’ సంపద ఇంతకు ఎవరికి? వెలుగులోకి ఆప్తమిత్రుడు..

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటా తన వీలునామా ద్వారా ఎవరికి ఎంత సంపదను ఇచ్చారనే విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, రతన్ టాటా తన ఆప్తమిత్రుడు, తాజ్ హోటల్స్ గ్రూప్ మాజీ డైరెక్టర్ అయిన 77 ఏళ్ల మోహిని మోహన్ దత్తాకు తన మిగిలిన ఎస్టేట్‌లో మూడింట ఒక వంతు వాటాను ఇచ్చారు. దీని విలువ అక్షరాలా రూ. 588 కోట్లుగా అంచనా. కుటుంబ సభ్యులు కాకుండా ఇంత భారీ మొత్తంలో ఆస్తులు పొందిన ఏకైక వ్యక్తి మోహిని మోహన్ దత్తా కావడం విశేషం. రతన్ టాటా తన రూ. 3,900 కోట్ల విలువైన ఎస్టేట్‌ను దాదాపు 20 మందికిపైగా పంచగా, వారిలో దత్తా మాత్రమే తన వారసత్వపు విలువపై మొదట్లో సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, వీలునామాలో ఉన్న ‘నో-కాంటెస్ట్’ క్లాజ్ కారణంగా ఆయన చట్టపరంగా దీనిని సవాలు చేయలేకపోయారు. ఈ నిబంధన ప్రకారం, వీలునామాను ఎవరైనా వ్యతిరేకిస్తే వారి వాటా రద్దు అవుతుంది.

రతన్ టాటా, మోహిని మోహన్ దత్తా అనుబంధం..
రతన్ టాటా, మోహిని మోహన్ దత్తా మధ్య అనుబంధం ఆరు దశాబ్దాల నాటిది. వీరు జంషెడ్‌పూర్‌లోని డీలర్స్ హాస్టల్‌లో తొలిసారి కలుసుకున్నారు. అప్పుడు టాటా వయస్సు 25 కాగా, దత్తా కేవలం 13 ఏళ్ల బాలుడు. ఆ తర్వాత దత్తా ముంబైకి మారారు. కొలాబాలోని టాటా నివాసం ‘బఖ్తావర్’లో నివసించారు. స్టాలియన్ ట్రావెల్ సర్వీసెస్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్‌లో దత్తా నివాస చిరునామా బఖ్తావర్‌గా నమోదైంది. ఆ సమయంలో టాటా కంపెనీలు తమ ప్రయాణ ఏర్పాట్ల కోసం స్టాలియన్ సేవలను ఉపయోగించాలని ఆదేశాలు ఉండేవి. రతన్ టాటా తన జీవితంలో ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారని దత్తా స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పారు.

మోహిని మోహన్ దత్తా ఎవరు?

మోహిని మోహన్ దత్తా తన కెరీర్‌ను తాజ్ గ్రూప్‌లోని ట్రావెల్ డెస్క్‌లో ప్రారంభించారు. 1986లో టాటా ఇండస్ట్రీస్ నుండి నిధులతో ‘స్టాలియన్ ట్రావెల్ సర్వీసెస్’ అనే తన సొంత ట్రావెల్ సంస్థను స్థాపించారు. స్టాలియన్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్‌లో దత్తా నివాస చిరునామా బఖ్తావర్‌గా నమోదైంది. ఆ సమయంలో టాటా కంపెనీలు తమ ప్రయాణ ఏర్పాట్ల కోసం స్టాలియన్ సేవలను ఉపయోగించాలని ఆదేశాలు ఉండేవి. 2006లో స్టాలియన్‌ను.. తాజ్ హోటల్స్ అనుబంధ సంస్థలో విలీనం చేశారు. దత్తాను.. ఏర్పడిన కొత్త సంస్థ ‘ఇండిట్రావెల్’కు డైరెక్టర్‌గా నియమించారు. ఆయన తాజ్ గ్రూప్‌లోని అత్యధికంగా సంపాదించే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు. 2015లో ఈ ట్రావెల్ సర్వీసెస్ వ్యాపారాన్ని టాటా క్యాపిటల్ టేకోవర్ చేయగా, 2017లో దానిని థామస్ కుక్‌కు విక్రయించారు. 2019లో తన కంపెనీ థామస్ కుక్‌లో విలీనమయ్యే వరకు మోహిని మోహన్ దత్తా బోర్డు డైరెక్టర్‌గా కొనసాగారు.

రతన్ టాటా తన జీవితంలో అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు