స్టాక్ మార్కెట్లో అదృష్టం కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని చెబుతుంటారు. అలాంటి అద్భుతాలెన్నో దలాల్ స్ట్రీట్‌లో నిత్యం కనిపిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన పనితీరును ప్రదర్శించి, పెట్టుబడిదారులకు కాసుల పంట పండిస్తోంది ఒక స్మాల్ క్యాప్ స్టాక్. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఇది రూ. 29 నుంచి రూ. 364 స్థాయికి దూసుకొచ్చి 1100 శాతానికి పైగా భారీ లాభాలను అందించింది. అదే టీఐఎల్ లిమిటెడ్. మీరు ఈ స్టాక్‌ను కలిగి ఉన్నారా? దేశంలో ప్రముఖ మెటీరియల్ హ్యాండ్లింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరికరాల తయారీదారుల్లో ఒకటైన TIL లిమిటెడ్.. పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది. రికార్డు స్థాయిల్ని బద్దలు కొడుతూ, భారతీయ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద సంపద సృష్టికర్తల్లో ఇదొకటిగా నిలిచింది.
రెండేళ్ల కిందట ఈ స్టాక్ ఒక్కో షేరు రూ. 29.30 వద్ద ట్రేడ్ అవుతుండేది. ఇప్పుడు, ఆ స్థాయి నుంచి ఏకంగా 1,141 శాతం పెరిగి రూ. 363.90కి చేరింది. ఇవాళ కూడా 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి అది రూ. 382.05 కు చేరింది. అంటే మీరు రెండేళ్ల కిందట టీఐఎల్ లిమిటెడ్ షేర్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ. 12.41 లక్షలకు పైగా ఉండేది. మే నెలలో కూడా ఇది ఏకంగా 77 శాతం నెలవారీ లాభాల్ని నమోదు చేయడం విశేషం. అంతకుముందు 2023, జులైలో 146.52 శాతం పెరగడం తర్వాత అంత పుంజుకోవడం ఇదే తొలిసారి.
ప్రస్తుత మొమెంటం కొనసాగితే, ఈ స్టాక్ ఆగస్టు 2024లో నమోదు చేసిన తన రికార్డు గరిష్ట స్థాయి అయిన రూ. 435ని కూడా అధిగమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.54 వేల కోట్లుగా ఉంది. ఇక స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 435.15 కాగా.. కనిష్ట ధర రూ. 165.40 గా ఉంది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ధ్రువీకరిణ పొందిన నిపుణుల సలహాలు తీసుకోండి.