బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టులు అమ్మకాలతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర ఒకే రోజు రూ.1200 తగ్గింది. తులం రూ.1,00,170కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ సైతం రూ.1,100 తగ్గి తులం రూ.99,450కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. అయితే, వెండి ధర రూ.100 పెరిగి కిలోకు రూ.1,07,200కి చేరుకున్నది. ప్రపంచవ్యాప్తంగా.. స్పాట్ బంగారం ఔన్సుకు 3,380.65కి తగ్గింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ వెండి 0.44 శాతం పెరిగి ఔన్సుకు 36.47కి చేరుకుంది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై కాల్పుల విరమణకున్న అవకాశాల నేపథ్యంలో బంగారు వ్యాపారుల్లో సెంటిమెంట్‌ని పెంచిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతకు దౌత్యపరమైన పరిష్కారాల కోసం ఇరాన్ ప్రయత్నిస్తున్నందని పలు నివేదికలు తెలిపాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. బంగారం ధర తగ్గుముఖం పడుతోందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన సమావేశానికి ముందు రోజు గరిష్ట స్థాయి నుంచి వెండి ధరలు తగ్గాయని కల్రాంతి పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలు పెరిగేందుకు అవకాశం ఉందన్నారు.