అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల కారణంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ప్రతికూల ప్రభావాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడం నష్టాలకు ప్రధాన కారణం. అసియా మార్కెట్లు కూడా ఈ రోజు నష్టాలనే మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా నష్టాల బాటలోనే సాగాయి.
సోమవారం ముగింపు (81, 796)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. చివరి వరకు నష్టాల్లోనే కదలాడింది. ఒక దశంలో దాదాపు 400 పాయింట్లు కోల్పోయి 81, 427 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. చివర్లో కాస్త పరిస్థితి సద్దుమణగడంతో భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 212 పాయింట్ల నష్టంతో 81, 583 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 93 పాయింట్ల నష్టంతో 24, 853 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో మాజగాన్ డాక్, మహానగర్ గ్యాస్, ఏబీ క్యాపిటల్, పీబీ ఫిన్‌టెక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హిందుస్తాన్ జింక్, సోనా బీఎల్డబ్ల్యూ, హిందుస్తాన్ కాపర్, జిందాల్ స్టీల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 389 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.24గా ఉంది.