ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్టార్ చెందిన స్మాల్ క్యాప్ కంపెనీ ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఇటీవల స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది. దీంతో ఒక షేరు కొన్న వారి ఖాతాలోకి 10 షేర్లు వస్తాయి. తాజాగా ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ ప్రకటించింది. దీంతో ఈ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. అంతే కాదు ఈ స్టాక్ గత ఏడాదిలోనే లక్ష పెట్టుబడిని రూ.6 లక్షలకు పైగా చేసింది. మరి ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకుందాం.
స్మాల్ క్యాప్ కేటగిరి, ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్టార్ సంస్థ ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (Indo Thai Securities Limited) కీలక ప్రకటన చేసింది. కంపెనీ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై స్టాక్ స్ప్లిట్ చేసేందుకు ఆమోదం తెలిపారు. తాజాగా స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రకటనతో కంపెనీ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. మరోవైపు గత ఏడాది కాలంలో ఈ స్టాక్ ఏకంగా 541 శాతం లాభాన్ని అందించింది. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ.6.41 లక్షలకుపైగా అందించింది. స్టాక్ స్ప్లిట్ తర్వాత రూ. 1830 లుగా ఉన్న షేర్ ధర రూ. 183 ల స్థాయికి దిగిరానుంది.
కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. బోర్డు అఫ్ డైరెక్టర్ల సమావేశంలో 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేసేందుకు ఆమోదం లభించింది. అంటే ప్రస్తుతం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేరుని రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 10 షేర్లుగా విభజించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. తాజాగా ఈ స్టాక్ స్ప్లిట్‌కి అర్హులైన వాటాదారులని నిర్ణయించేందుకు అవసరమైన రికార్డు తేదీని జూలై 18, 2025గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.
శుక్రవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ షేరు ధర స్వల్ప లాభంతో కొనసాగుతోంది. క్రితం రోజు 2.49 శాతం లాభంతో రూ. 1830 వద్ద ముగియగా.. ఈ వార్త రాసే సమయానకిి రూ.1845 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 2200.15 కాగా.. కనిష్ట ధర రూ. 236గా ఉంది. గత వారంలో ఈ షేరు 2 శాతం, గత నెల రోజులల్లో 3 శాతం లాభాన్ని అందించింది. గత ఆరు నెలల్లో 17 శాతం పెరిగింది. గత ఏడాదిలో ఈ షేరు 541 శాతం లాభాన్ని అందించింది. ఇక గత ఐదేళ్లలో చూస్తే 9819 శాతం మేర లాభాలు అందించింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి ఏకంగా రూ.1 కోటి వరకు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 2180 కోట్లుగా ఉంది.